వివాహాలు దాదాపుగా 30 ఏళ్ల లోపే జరుగుతాయి. మరికొంతమంది పెళ్లిలో నలభైలలో కూడా జరుగుతాయి. అంతే కాని మరీ 80 ఏండ్ల వయస్సులో ఎవరూ పెళ్లిళ్లు చేసుకోరు. కానీ మహబూబాబాద్‌కు చెందిన ఇద్దరు వృద్ధులు ఎనిమిది పదులు వయస్సులో పెళ్లి చేసుకున్నారు.
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వస్త్రం తండాకు చెందిన సమిడా నాయక్ వయసు 80 ఏళ్లు. ఆయన 75 ఏళ్ల వయస్సున్న గుగులోతు లాలమ్మను వివాహం చేసుకున్నారు. అయితే ఈ ఇద్దరూ గతంలో కూడా దంపతులే. 70 ఏళ్ల క్రితం వారికి గంధర్వ వివాహం జరిగింది. వారికి నలుగురు కొడుకులు, ఒక బిడ్డ ఉన్నారు.
అయితే నాడు గంధర్వ వివాహం చేసుకున్న ఈ దంపతులకు సంప్రదాయ పద్ధతిలో మళ్లీ పెళ్లి జరిపించాలని వారి మనుమలు, మనుమరాలు నిర్ణయించారు. ఆ మేరకు మనుమడు యాకూబ్ పుట్టినరోజు సందర్భంగా వారి తాత, నానమ్మలకు వివాహం జరిపించారు. ఈ వృద్ధ దంపతుల పెళ్లి చూడటానికి తండాలోని జనం అంతా తరలివచ్చారు. కాగా, ఈ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.