మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి మాయమైపోతున్నాడు. అలాంటిది కేవలం మూడు సెకన్లలోనే మనిషిని మృత్యువు కాటేసింది. సికింద్రాబాద్ బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రిలో ఉన్నట్టుండి ఓ భారీ చెట్టు కూలిపోయింది. అదే సమయంలో చికిత్స కోసం ఆసుపత్రి లోపలికి టూవీలర్‌పై వస్తున్న భార్యాభర్తలపై అది పడిపోయింది. స్పాట్‌లో భర్త ప్రాణాలు కోల్పోగా.. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి.
బైక్ నడుపుతున్న రవీందర్ చెట్టు కూలిపోతుందన్న విషయాన్ని గమనించలేదు. ఏమాత్రం చెట్టు ఒరిగిపోతున్నట్టు చూసినా ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేవారేమో..! మూడే మూడు సెకన్ల గ్యాప్‌లో అంతా జరిగిపోయింది. ఆ కుటుంబం టూవీలర్‌పై ఆస్పత్రి లోపలికి రావడం.. అదే సమయంలో చెట్టు కూలిపోవడం.. అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఈ విషాదం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. చెట్టుకూలిన ఘటనలో రవీందర్ స్పాట్‌లోనే చనిపోయారు. ఆయన భార్య సరళ పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. సరళాదేవి ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. భార్యాభర్తలకు జరిగిన ఈ ప్రమాదంతో తీవ్ర విషాదం నెలకొంది.